అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టును పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ అంతర్‌ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రెంజల్‌ మండలంలోని కందకుర్తి చెక్‌ పోస్టును సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం పరిశీలించి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

త్రివేణి సంగమమైన కందకుర్తి బ్రిడ్జిని పరిశీలించారు. ఈ మార్గం గుండా ఎక్కువగా రవాణా జరిగే వస్తువులు, సామాగ్రి గురించి ఆరా తీశారు. అంతకుముందు అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితాలోకి చేర్చబడిన నవీపేట మండలంలోని అభంగపట్నం పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌, సీ.పీ సందర్శించారు. 2018 ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకోగా, ప్రస్తుతం స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితి గురించి గ్రామస్తులను వాకబు చేశారు.

సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆందోళనకర అంశాలేమి లేవని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కందకుర్తి ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా నాలుగు సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులను నెలకొల్పి విస్తృతస్థాయిలో నిరంతరంగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.

ఇందులో భాగంగానే నిజామాబాద్‌ – నాందేడ్‌ జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న కందకుర్తి వద్ద ఎన్నికల సందర్భంగా ప్రత్యేక చెక్‌ పోస్ట్‌ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముందస్తుగానే ఏర్పాట్లను చేపడుతున్నామని, ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయిన మీదట సరిహద్దు ప్రాంతాల్లో అనునిత్యం 24 గంటల పాటు నిరంతరంగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఎన్నికలను ప్రభావితం చేసేలా పొరుగు రాష్ట్రాల నుండి ఎలాంటి నిషేధిత పదార్థాలు, అక్రమ మద్యం, నగదు వంటివి జిల్లాలోకి తీసుకురాకుండా చెక్‌ పోస్టుల ద్వారా కట్టడి చేస్తామన్నారు. కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సైతం సందర్శించి ప్రస్తుతం స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతోందని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »