కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రజలు మానవతా హృదయం కలవారని, ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకురావడం ముదావహమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో రక్తదానం పై మీడియా ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తున్న జర్నలిస్టులకు, అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి ఆదివారం కర్షక బీ.ఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన అభినందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల, మత తారతమ్యం లేకుండా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైనా ప్రతి మూడు మా సాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనులు కారని, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి జబ్బులు కూడా దరిచేరవని ఆరోగ్య సంస్థ తెలిపిందని కలెక్టర్ అన్నారు. ఆపద సమయంలో రక్తం లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వాలి… ఇప్పించుటకు ప్రోత్సహించాలని చెప్పారు.
తల సేమియాతో బాధపడుతున్న చిన్నారులకు పక్షం రోజులకు ఒకసారి రక్తం ఎక్కించవలసి ఉంటుందని, వారికి ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నామని అన్నారు. డెంగ్యూ వల్ల ప్లేట్ లెట్స్ పడిపోతుంటాయని, ఆరోగ్యవంతులైన నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోరి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతల సమూహం ఫౌండర్ బాలు మాట్లాడుతూ 2007లో ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించి 15 సంవత్సరాలలో 16 వేల యూనిట్ల రక్తం సేకరించి ఎందరికో ప్రాణదానం చేశామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో రక్తం లభించక చనిపోయిన వారి సంఖ్య సింగల్ డిజిట్లో ఉందని అన్ని సున్నా శాతం తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జర్నలిస్టులను, రక్తదాతలను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, రక్తదాతల సమూహం అధ్యక్షులు వీర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్,కిరణ్, సలహాదారుడు రమణ, శ్రీకాంత్ రెడ్డి, నిశాంతి రెడ్డి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.