కామారెడ్డి, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా పనిచేశారని అన్నారు.
ఇద్దరు మహనీయుల జన్మదినం నేడు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతిపిత 154 వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ వంటి ఎన్నో ఉద్యమాలు అహింసా మార్గంలో చేపట్టి బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలారన్నారు.
ఆ మహనీయుల నిస్వార్థ సేవలు, త్యాగాల ఫలితంగా మనమీనాడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అట్టి మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మంచి ఆలోచనతో ముందుకు సాగాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకన్న, వైస్ చైర్మన్ కుంబాల రవి, మున్సిపల్ కమీషనర్ దేవేందర్, టి.యెన్.జి.ఓ. అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.