డిచ్‌పల్లి, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కళల పీఠాధిపతిగా తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మంగళవారం ఉదయం నియామకం పొందారు. ఉపకులపతి, వాకాటి కరుణ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి కళల పీఠాధిపతి నియామక పత్ర ఉత్తర్వులను ఆచార్య వంగరి త్రివేణికి అందించారు. ఇది వరకు కళల పీఠాధిపతిగా ఉన్న ఆచార్య పి. కనకయ్య నుంచి ఆచార్య వి. త్రివేణి చార్జ్ తీసుకోనున్నారు.
త్రివేణి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2007 లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొంది అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ప్రమోషన్ పొందారు. తెలుగు అధ్యయనశాఖకు విభాగాధిపతిగా, రెండు పర్యాయాలు పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ గా వ్యవహరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రజాసంబంధాల అధికారిగా, సాంస్కృతిక కార్యక్రమాల కో-ఆర్డినేటర్ గా, యువజన సంక్షేమ అధికారిగా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, గ్రంథాలయ నిర్వహణా అధికారిగా తదితర పాలనాపర పదవులు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ తన పీఠాధిపతి పదవీ కాలంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగే విధంగా, ప్రామాణికమైన సిద్ధాంత గ్రంథాలు వెలువడే విధంగా బాధ్యత వహిస్తానని అన్నారు. తనను కళల పీఠాధిపతిగా నియమించినందుకు గాను ఉపకులపతి వాకాటి కరుణకి, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. పీఠాధిపతిగా నియామకం పొందిన త్రివేణికి పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.