బాన్సువాడ, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాన్సువాడలో ఆశ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా గురువారం పట్టణంలో దుకాణాలకు తిరుగుతూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని గ్రామాలను బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు తమ కుటుంబాలను చాలీచాలని జీతాలతో పోషించుకుంటున్నారన్నారు.
ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న మందులను ఉచితంగా అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు ముందుండి చేశారని గుర్తు చేశారు.
ఆశా వర్కర్లకు 18000 వేతనం నిర్ణయించి వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత , ఈఎస్‌ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు.ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను గుర్తించి డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్‌లు సుమలత, లావణ్య, విజయ, పద్మ, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.