నిజామాబాద్, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్, సీ.పీలు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి (సోమవారం) నుండే అమలులోకి వచ్చిందని, డిసెంబర్ 5వ తేదీ వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ సహా జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిర్వహించాల్సివస్తే తప్పనిసరిగా ముందస్తుగా లిఖిత పూర్వకంగా అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారుల నుండి అనుమతులు పొందాలని సూచించారు.
ఇప్పటి నుండి ఎంసిఎంసి, సోషల్ మీడియా బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఆరు నియోజకవర్గాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ , వీడియో సర్వేలెన్స్ బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. నవంబర్ 3వ తేదీ నుండి ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందాలు ఏర్నాలు అవుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 13 లక్షల 65 వేల 811 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకు గాను 1549 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
అర్బన్ ఏరియాలో 491 పోలింగ్ కేంద్రాలు రూరల్ ఏరియాల్లో 1058 పీ.ఎస్ లు ఉన్నాయని వివరించారు. మొత్తం ఓటర్లలో 7,18,609 మంది మహిళా ఓటర్లు, 6,47,149 పురుష ఓటర్లు, 59 మంది ఇతర ఓటర్లు, 800 సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు 41,019 మంది, ఎనభై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 17,363 మంది, దివ్యంగ ఓటర్లు 23,934మంది ఉన్నారని అన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లాలో ప్రతి వెయ్యి మందికి 707 మంది ఓటర్లు ఉన్నారని, జెండర్ నిష్పత్తి 1110 గా ఉందని తెలిపారు. స్వీప్ కార్యక్రమం సందర్భంగా కొత్తగా 53,653 మంది పేర్లు ఓటరు జాబితాలో నమోదు కాగా, వివిధ కారణాలతో 8938 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని అన్నారు.
ప్రతి నియోజకవర్గానికి మహిళలకు 5, యువతకు 1, వృధ్దులకు 1 చొప్పన మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తామని అన్నారు కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే ఈసారి కొత్తగా సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో తెచ్చిందన్నారు.
ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈ.సీ దృష్టికి తేవచ్చని సూచించారు. 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యంగ ఓటర్లు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఈ.సీ నిర్ణయం తీసుకుందని, ఎన్నికల ప్రకటన వెలువడిన ఐదు రోజులలోపు 12-డి ఫారం భర్తీ చేసి బీ.ఎల్.ఒలకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. పొలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, సమస్యాత్మక కేంద్రాలలో పోలీసు బందోబస్త్‌తో పాటు మైక్రో అబ్జర్వర్స్ పరిశీలిస్తారని తెలిపారు.
జిల్లా పరిహద్దుల్లో చెక్క్ పోస్టులు ప్లైయింగ్ స్కాడ్ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో సార్వతిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించామని, నోడల్ అధికారులను, సర్వేలెన్స్, ప్లైయింగ్ స్కాడ్స్, సిబ్బందిని నియమించామని తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులపై ఇప్పకే పలుధపాలు శిక్షణ, సమావేశాలు నిర్వహించామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాం తదితరులు పాల్గొన్నారు.