కామారెడ్డి, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా ఆమలుచేయుటపై దిశా నిర్దేశం చేయుటకు నోడల్ అధికారులు, వివిధ బృందాలు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సన్‌లో మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ భవనాలపై రాజకీయ పార్టీలకు ప్రచారాలకు సంబంచించి ఉన్న పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫ్లాగ్స్ వెంటనే తొలగించాలని, శిలా విగ్రహాలను కప్పి ఉంచాలని సూచించారు.
అదేవిధంగా పబ్లిక్ స్థలాలలో ఉన్న వాటిని 48 గంటలలోగా, ప్రైవేట్ స్థలాల్లో ఉన్న వాటిని 72 గంటలలోగా తొలగించాలని తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, మునిసిపల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, వివిధ సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు. ప్రగతి ఉన్న పనులు కొనసాగిస్తూ , ప్రారంభం కానీ పనులు, టెండరు దశలో ఉన్నవి మొదలు పెట్టవద్దని, వాటి జాబితాలను 72 గంటలలోగా అందజేయవలసినదిగా ఆదేశించారు.
లైసెన్స్ పొందిన ఆయుధాలను డిపాజిట్ చేసేలా చూడాలన్నారు. కరపత్రాలు, పోస్టర్ల ముద్రణకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ ఉంటేనే ముద్రించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ముద్రణా సంస్థలను కోరారు. వ్యయ నియంత్రణపై క్లోజ్‌గా మానిటరింగ్ చేయడం జరుగుతుందని, చేసిన ప్రతి ఖర్చుకు రిజిస్టర్ లెక్క చూపవలసి ఉంటుందని, ఫ్లైయింగ్ స్క్వాడ్ నిశితంగా పరిశీలిస్తుందని అన్నారు. ప్రతి నియోజక వర్గానికి మూడు టీముల చొప్పున 2 షిఫ్తులలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అదేవిధంగా వీడియో సర్వైవల్ టీమ్ ప్రతిదీ చిత్రీకరిస్తుందని, కుల,మత వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా, వ్యక్తిగత విమర్శలు, వంటివి ఉండరాదన్నారు. ప్రభుత్వోద్యోగులు ఎవరు కూడా రాజకీయ సంబంధ అంశాలలో, కార్యక్రమాల్లో భాగస్తులై వ్యవస్థకు చెడ్డపేరుతేవద్దని, ఆటువంటి వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందకుండా చూడాలని, వాట్సాప్ గ్రూప్‌లు మానిటరింగ్ చేయాలని అన్నారు.
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరు కృషి చేయాలని, ఎన్నికల నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి మారట్లాడుతూ ఎన్నికల సంఘం నవంబర్ 3 న షెడ్యూల్ ప్రకటిస్తుందని, 10 వరకు నామినేషన్లు స్వీకరించి, 13 న స్క్రూటినీ చేస్తుందని, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తుందని అన్నారు.
నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని, డిసెంబర్ 5 న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్ నియాజక వర్గాల్లో 6,61,163 మంది ఓటరులున్నారని, ఇందుకోసం 791 పోలింగ్ కేంద్రాలు, 75 రూట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మండలంలో ఒక మాడల్ పోలింగ్ కేంద్రాన్ని, దివ్యంగుల కోసం నియాజక వర్గం వారీగా మాడల్ పోలింగ్ కేంద్రంతో పాటు యువతను ప్రోత్సహించుటకు మాడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఓటింగ్ శాతం అధికంగా ఉందని, కాగా పట్టణ ప్రాంతాలలోని వారు ఇంకా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వీప్ ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ.వి.ఏం లపై అవగాహన కలిగించామన్నారు.ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని గుర్తించి నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసిజర్ లో ఎన్నో నిబంధనలు పెట్టిందని అందులో అభ్యర్థి ఎన్నికల ఖర్చు 40 లక్షలకు పరిమితి విధించిందని అన్నారు. ఓటరుకు డబ్బులు,కానుకలు ఇవ్వడం, మభ్యపెట్టడం ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం నేరంగా పరిగణించిందని, అతిక్రమిస్తే శిక్షార్హులని అన్నారు.
అసత్య వార్తలు వ్యాప్తి చెందకుండా చూడవలసిన భాద్యత మీడియాపై ఉందని అన్నారు. ద్రువీకరించని ప్రకటనలు ప్రచురించరాదని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల, నోడల్ అధికారులు, తహసీల్ధార్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.