నిజామాబాద్, అక్టోబర్ 11
విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా సాధన చేయాలని, అందుకు కావలసిన శ్రమ, సమయపాలన, క్రమశిక్షణ అలవరుచుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లాభిశెట్టి మహేశ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలో జరిగిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో ఉదాహరణలతో వివరించారు. చదువుతోపాటు చక్కటి నైపుణ్యాలు సాధించాలన్నారు.
కళాశాల వ్యవస్థాపకులు, డైరెక్టర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్తినిలకు ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉషోదయ డిగ్రీ కళాశాల బోధన్ ప్రిన్సిపాల్ గంగాధర్‌లు విద్యార్థినిలనుద్దేశించి దిశా నిర్దేశం చేశారు.
అనంతరం ఉత్సాహంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు జూనియర్, సీనియర్ విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. కొత్త, పాత పాటల మేలు కలయికగా అనేక పాటలకు విద్యార్థులు చక్కగా డ్యాన్సులు ప్రదర్శించి ఆహుతులను అలరించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.