కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను సంపూర్ణంగా నిర్మూలించాలని కామారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి అన్నారు. బాల్య వివాహా రహిత భారతదేశం అనే అంశంపై రాజంపేట, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సాధన సంస్థ, జిల్లా న్యాయ సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల కార్మికులు లేని జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని కోరారు. బాలలపై హింస లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు తాము చేసుకోబోమని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సివిల్ జడ్జి భార్గవి మాట్లాడారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులకు జరిమానా విధిస్తామని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చని సూచించారు. బాలలకు 54 రకాల హక్కులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సిడబ్ల్యూసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను తెలిపారు. బాలికలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, బాలురు 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఇష్టపడి చదివి సమాజంలో ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. బాలల హక్కులను సంపూర్ణంగా పరిరక్షిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 50 గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సాధన సంస్థ డైరెక్టర్ మురళీ మోహన్ మాట్లాడారు. జిల్లాలో బాలుల హక్కుల గురించి తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. బాల కార్మికులను పనిలో నుంచి విముక్తి కల్పించి పాఠశాలల్లో చేర్పించామని చెప్పారు. వారికి కావలసిన సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను శాశ్వతంగా నిర్మూలిస్తామని సంతకాలను సేకరణ చేపట్టారు.
బచ్పన్ బచావో ఆందోళన్ రాష్ట్ర కోఆర్డినేటర్ చందన, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, జిల్లా బాలికల పరిరక్షణ అధికారిని స్రవంతి, ఎంపీడీవో బాలకిషన్, తహసిల్దార్ అనిల్ కుమార్, మండల విద్యాధికారి రామస్వామి, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్య, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారిని శ్రీవాణి, సాధన సంస్థ కోఆర్డినేటర్లు రవి, సత్యం, విద్యార్థులు పాల్గొన్నారు.