కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా తమ మేదస్సులకు పదునుపెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల స్క్రిప్ట్స్ రూపొందించి ఒకటి, రెండు నిముషాల నిడివి గల మంచి డాక్యుమెంటరీలు రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టి.ఎస్.ఎస్. కళాకారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ లో కలిసిన కళాకారుల బృందంతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం బాగున్నా పట్టణ ప్రాంతాలలోని యువతలో కొంత నిర్లిప్తత కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా ఉందని అన్నారు.
పోలింగ్ రోజు సెలవే కదా అని ఓటింగ్ క్యూ లైన్‌లో నిలబడాల, సెలవును సరదాగా గడుపుదామనే ఆలోచన, ధోరణి నేటి యువతలో ఉందని అన్నారు. ఓటు విలువ, ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరమున్నదని అన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవాలంటే తప్పకుండ ఓటెయ్యాలనే నైతిక బాధ్యత వారిలో కలిగేలా చక్కటి స్క్రిప్ట్‌తో డాక్యుమెంటరీలు రూపొందించాలన్నారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ మహిళలు, కూలీలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తదితర అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని చక్కటి వేషధారణతో పల్లెలు, పట్టణాలలోని, రైల్వే స్టేషన్, బస్టాండు తదితర ప్రాంతాలలో షూటింగ్ చేసి డాక్యుమెంటరీలను అందించాలన్నారు. వాటిని యూ ట్యూబ్, పేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.
అదేవిధంగా పొలిసు శాఖలోని కళాజాత బృందంతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఓటు అవగాహనపై కార్యక్రామాలు ప్రదర్శించే విధంగా చక్కటి కార్యాచరణ ప్రణాళిక అందించవలసినదిగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతికుమార్, కళాకారులు పాల్గొనారు.