కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం టీఎస్ పిఎస్సిని ప్రక్షాళన చేయాలని కోరుతూ, నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్థి ప్రవల్లిక కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలంగాణ జన సమితి, బిసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్, టీజేఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ నిజ్జన రమేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించి ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి అమరుల ఆశయాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుపరచలేకపోయిందని, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం, టిఎస్పిఎస్సి అసమర్థత వల్ల గ్రూప్ వన్ పరీక్ష రెండుసార్లు రద్దు కావడం జరిగిందని, 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు రావడంలేదని కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ఓటమి తద్యమని నిరుద్యోగులు, విద్యార్థులు మేల్కొనాలని ఇలాంటి ప్రభుత్వాన్ని మరొకసారి ఎన్నుకుంటే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగుల సహకారంతో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.