బాన్సువాడ, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాల హయాంలో సంక్షేమ రంగానికి చాలీచాలని నిధులు ఇచ్చేవారని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచడం జరిగింది అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, 2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను వంద శాతం అమలు చేశారన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లోంచి వచ్చిన పథకాలని, కరోనా వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు.
సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే విజయవంతమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కానీ హామీలను ఇస్తున్నారని ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమాతో భరోసా లభిస్తుందని ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేమన్నారు.
సమావేశంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు లింగమేశ్వర్, బాడీ శ్రీనివాస్, వెంకటేష్, నాయకులు గురు వినయ్, గోపాల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, నరసన్న చారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.