కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫీలో రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయుటకు ఈ నెల చివరి వారం జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాలలో ధాన్యం పండిరచగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని అందుకనుగుణంగా పాక్స్ ఆధ్వర్యంలో 325, ఐ.కే.పి. ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వానాకాలం 2023-24 ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సమాంతరంగా ధాన్యం కొనుగోళ్ల సీజన్ వచ్చినందున అధికారులు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కాకుండా క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలలో అవసరమైన తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి క్లినర్లు, కాంటాలు, టార్పాలిన్లను సిద్ధం చేయాలని సూచించారు.
గన్ని సంచుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. రైతులు నాణ్యాత ప్రమాణాల కనుగుణంగా తేమ, తాళ్లు లేకుండా ధాన్యం కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందేలా రైతు వేదికల ద్వారా అవగాహన కలిగించాలని వ్యవసాయాధికారులు, కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి 2,203, ముతక రకానికి 2,183 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
రైతులకు టోకెన్లు ఇచ్చి ధాన్యం వచ్చిన వెంటనే సరిగ్గా తూకం వేసి ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. జిల్లాలో ఉన్న 39 బాయిల్డ్ , వంద రా రైస్ మిల్లర్లు పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని హమాలీల కొరత రాకుండా చూసుకోవాలని, మిల్లుకు ధాన్యం వచ్చిన వెంటనే ఆన్ లోడిరగ్ చేయాలని, ధాన్యం నిలువకు స్థలం ఉంచుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ వద్ద నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
ధాన్యం రవాణాకు అవసరమైన లారీలు అందుబాటులో ఉంచి మిల్లులకు ట్యాగింగ్ చేయాలన్నారు. రైతులు కూడా సంయమనం పాటించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, డీఎస్‌ఓ మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా సహాకార అధికారి సింహాచలం, వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారి రమ్య, జిల్లా రవాణాధికారి వాణి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు లింగం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.