నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి బోధన్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్. కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయాలను సందర్సించారు.
ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఆయా కేంద్రాలలో ఏ మేరకు పరిస్థితులు అనువుగా ఉన్నాయన్నది పరిశీలన జరిపారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఎలాంటి లోతుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్, బాన్సువాడ ఆర్డీఓలు రాజాగౌడ్, భుజంగరావు తదితరులు ఉన్నారు.