కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరు పౌరులు ఓటరు జాబితాలో తమ పేరును ఏ పోలింగ్ స్టేషన్‌లో ఏ సీరియల్ నెంబరులో ఉందొ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పరిశీలించుకుని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. రంగోలి ద్వారా ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ నైతిక భాద్యతగా ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇచ్చుటకు స్వీప్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు, డబ్బులకు, కానుకలకు లొంగక, తమ మనసాక్షి మేరకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా బలమైన ప్రజాస్వామ్యం కొరకు ఘనమైన భాగస్వసామ్యం అవసరమనే అంశంతో ఓటు ఆవశ్యకత , ఓటు విలువ ఓటు నా జన్మహక్కు అనే తదితర సందేశాలతో మహిళలు వేసిన ప్రతి ముగ్గును కలెక్టర్ తిలకించి వారిని ప్రశంసించారు.
రంగోలిలో పాల్గొన్న వారికి ప్రోత్సహాకంగా గిఫ్ట్ బాక్సులు అందజేశారు. సాయంత్రం జరిగి బతుకమ్మ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల రిసోర్స్ పర్సన్లు, మహిళలు పాల్గొన్నారు.