నిజామాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్ విధుల పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రిసైడిరగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం ఆస్కారం కల్పించకూడదని, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా మాక్ పోల్ జరిపిన తరువాత తప్పనిసరిగా డాటాను డిలీట్ చేయాలని, ఈ విషయాన్ని ప్రతి ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారి గుర్తుంచుకోవాలని అన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ డేటా జీరో ఉందా లేదా అన్నది తప్పక పరిశీలించుకోవాలని తెలిపారు.
అదేవిధంగా పోలింగ్ ముగిసిన మీదట ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనే వివరాలను జాగ్రత్తగా సరిపోల్చుకోవాలని సూచించారు. 17 -ఏ, 17 -సి వివరాలతో కంట్రోల్ యూనిట్ వివరాలు సరిగ్గా సరిపోవాలని తెలిపారు. కాగా, పోలింగ్ సందర్భంగా ఓటింగ్ యంత్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. మాక్ పోల్ సమయంలో సాంకేతిక ఇబ్బంది ఏర్పడినప్పుడు సంబంధిత యంత్రాన్ని మాత్రమే మార్చాలని, పోలింగ్ సమయంలో మాత్రం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లలో ఏ ఒక్క దానిలోనూ సమస్య తలెత్తినా సి.యు, బీ.యు లను మార్చాలని సూచించారు.
పోలింగ్ సజావుగా నిర్వహిస్తే, కౌంటింగ్ సాఫీగా జరిగి ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ విధులను ఎంతో జాగరుకతతో నిర్వహించాలని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ పర్యవేక్షణ జరపాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు సంజీవ్, గోపాలకృష్ణ, ప్రిసైడిరగ్ అధికారులు పాల్గొన్నారు.