నిజామాబాద్, అక్టోబర్ 20 :
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు.
ప్రస్తుత సాధారణ ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.