నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వివి ప్యాట్ల మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు.
ర్యాండమైజెషన్ ద్వారా ఖరారైన జాబితాను ప్రతినిధులకు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ర్యాండమైజెషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వివి ప్యాట్లు కేటాయించడం జరుగుతుందని, ఆయా సెగ్మెంట్లలో స్ట్రాంగ్ రూమ్ లలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ వాటిని భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్ లో ఉంచడం జరుగుతుందని, 40 శాతం వి.వి.ప్యాట్ లను రిజర్వ్ లో ఉంచేలా అదనంగా కేటాయిస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండ పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడుతున్నామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
ర్యాండమైజెషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.