ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం బర్దీపూర్‌లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యాన్ని పరిశీలించి, మాయిశ్చర్‌ మీటర్‌ ద్వారా స్వయంగా తేమ శాతాన్ని కొలిచారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

‘ఏ’’ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌ కు 2203 రూపాయలు, ముతక రకానికి 2183 చొప్పున మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. అయితే రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి, బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని తేవాలని, ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారిచే ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, బ్యాంకు పాస్‌ బుక్కు, పట్టా పాసు పుస్తకం జిరాక్స్‌ ప్రతులను వెంట తేవాలని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా, పూర్తిస్థాయిలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటది వెంట లారీలలో లోడ్‌ చేయించి నిర్దేశిత రైస్‌ మిల్లులకు తరలించాలని, సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పాలిన్‌ లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ధాన్యం విక్రయించిన రైతులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షామియానాలు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్‌ వెంట డీ ఎస్‌ ఓ చంద్రప్రకాశ్‌, సివిల్‌ సప్లైస్‌ ఢీ ఎమ్‌ జగదీష్‌, డీసీఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, సొసైటీల సీఈఓ లు, స్ధానిక అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »