నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై శనివారం రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్ యాదవ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీ.ఈ.ఓ దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను సత్వరమే పరిశీలిస్తూ, వెంటదివెంట ఎన్నికల సంఘానికి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పంపించాలని సూచించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా జారీ చేయాల్సిన అనుమతుల విషయంలోనూ జాప్యానికి తావులేకుండా చూడాలని, ప్రతిరోజు ఎంసిఎంసికి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
సి.విజిల్ ఫిర్యాదులను వెంటదివెంట పరిశీలిస్తూ క్షేత్రస్థాయి విచారణ జరిపి నివేదికలు అందించాలన్నారు. సి.విజిల్ యాప్ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాగా, నగదు జప్తు చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలు వంటి వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని హితవు పలికారు.
రూ. పది లక్షలకు పైగా నగదు పట్టుబడిన సందర్భాలలో ఆదాయపన్ను శాఖ అధికారులకు స్వాధీనపర్చాలని సూచించారు. నగదు, బంగారం, ఇతర వస్తువులను జప్తు చేసినప్పుడు పూర్తి పారదర్శకతను పాటించాలని, పట్టుబడిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిరచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను సరిచూసుకోవాలని, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు విషయంలోనూ తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీ.ఈ.ఓ సూచించారు. ఇదివరకు సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణిస్తూ క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తాజాగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీ.ఈ.ఓ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.