నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం ల తరలింపు ప్రక్రియ నిర్వహించారు. రాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి.ప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా, పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చారు.
ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈ.సీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.