నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిజామాబాద్ జిల్లా స్థాయి సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగింది. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ.యాదిరెడ్డి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్, ఎన్.పద్మశ్రీ, డీపీఆర్‌ఓ, బీ. రవికుమార్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి, ఎన్.ఐ.సి, బీ. ధర్మానాయక్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, ఐ అండ్ బీ (సీబీసీ) తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో కమిటీ పనితీరుపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన దరఖాస్తులు, వాటిని పరిశీలించిన విధానం, జారీ చేసిన అనుమతులు తదితర అంశాలను చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎంసిఎంసి కమిటీ క్రమం తప్పకుండా ప్రతి రోజు సమావేశమై పెయిడ్ న్యూస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర వీడియోలు, సందేశాలు తదితర వాటిపై చర్చించి తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం వచ్చే దరఖాస్తులకు సంబంధించి వాటిలోని అంశాలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి అభ్యంతరం లేని వాటికే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల మాధ్యమాలు సహా అన్ని ప్రధాన దిన పత్రికలు, లోకల్ పేపర్స్, ఈవెనింగ్ ఎడిషన్స్ ప్రతి రోజు పరిశీలిస్తూ ఎన్నికల ప్రచార ప్రకటనలు, పెయిడ్ న్యూస్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా అభ్యంతరక రీతిలో ఉండే అంశాలతో కూడిన న్యూస్ గుర్తించాలని సూచించారు.
పేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎన్నికలతో ముడిపడిన అంశాలను అనునిత్యం నిర్విరామంగా నిశిత పరిశీలన జరపాలని, అవసరమైన వాటిని తగిన రీతిలో రికార్డు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.