కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్ ప్రకారం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు.
ఎన్నికల నోటిఫికేషన్ తేదీ సమీపిస్తున్నందున వివిధ రాజకీయ పార్టీలు తమ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లకు వస్తారని, అయితే అనుమతి పొందిన వాటిని మాత్రమే ముద్రించాలని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కలెక్టర్ స్పష్టం చేశారు. పార్టీలు తాము ప్రచురించవలసిన వివరాలకు సంబంధించిన మ్యాటర్‌ను నిర్ణీత ప్రోఫార్మలలో సమర్పించాలని, అట్టి వాటిని ఎం.సి.ఎం.సి. కమిటీ పరిశీలించి 24 గంటలలోగా అనుమతించడం గాని, తిరస్కరించడం గాని జరుగుతుందని తెలిపారు.
పోస్టర్లు గాని, కరపత్రాలు గాని, ఇతర ప్రచార సామాగ్రి ముద్రించుటకు ముందుగా ఇద్దరు వ్యక్తులు తనకు పబ్లిషర్ తెలిసినట్లుగా ధృవీకరిస్తూ ఇచ్చిన డిక్లరేషన్ కాపి రెండు పత్రాలను పబ్లిషర్ నుండి పొందిన పిదప మాత్రమే సదరు ప్రింటరు ముద్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురించే ప్రచార సామాగ్రిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్, ప్రచురణల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా వివరాలు తప్పని సరిగా ప్రచురించాలని తెలిపారు.
ముద్రితమైన ప్రచార సామాగ్రి ప్రతి వెంట ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్ తో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య, సదరు ప్రింటింగ్ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి, రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రింటింగ్, పబ్లిషర్ పేరు లేకుండా, పోస్టర్లు, కరపత్రాలు,ఇతర ప్రచార బీసామాగ్రిని ముద్రించినా, నిర్దేశించిన సంఖ్యకు మించి ముద్రించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127-ఏ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.