నిజామాబాద్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువైన వసతులను పరిశీలన జరిపారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాల్ లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ అండ్ బీ ఇంజినీర్లకు సూచించారు.
అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎలక్షన్ అబ్జర్వర్లు పరిశీలన నిమిత్తం వచ్చే సమయానికి మరమ్మతులు, ఆధునికీకరణ పనులన్నీ పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజు, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ బి.నరేష్, శ్రీరాంకుమార్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.