నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు సూచించారు. శనివారం కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం అయ్యారు.
రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ సమీపిస్తున్నందున వివిధ రాజకీయ పార్టీలు తమ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ లకు వస్తారని, అయితే అనుమతి పొందిన వాటిని మాత్రమే ముద్రించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పార్టీలు తాము ప్రచురించవలసిన వివరాలకు సంబంధించిన అంశాలను నిర్ణీత ప్రోఫార్మలలో సమర్పించాలని, అట్టి వాటిని ఎం.సి.ఎం.సి కమిటీ పరిశీలించి 24 గంటలలోగా అనుమతించడం గాని, తిరస్కరించడం గాని జరుగుతుందని తెలిపారు. పోస్టర్లు గాని, కరపత్రాలు గాని, ఇతర ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రించుటకు ముందుగా ఇద్దరు వ్యక్తులు తనకు పబ్లిషర్ తెలిసినట్లుగా ధృవీకరిస్తూ ఇచ్చిన డిక్లరేషన్ కాపి రెండు పత్రాలను పబ్లిషర్ నుండి పొందిన తరువాతనే సదరు ప్రింటరు ముద్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురించే ప్రచార సామాగ్రిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్, ప్రచురణ ప్రతుల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా వివరాలు తప్పని సరిగా ముద్రించాలని తెలిపారు. ముద్రితమైన ప్రచార సామాగ్రి ప్రతి వెంట ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్‌తో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య, ప్రింటింగ్ చేయడానికి వసూలు చేసిన వెల(ధర)కు సంబంధించిన వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించారు.
ప్రింటింగ్, పబ్లిషర్ పేరు లేకుండా ఎన్నికల అంశాలతో ముడిపడిన పోస్టర్లు, కరపత్రాలు,ఇతర ప్రచార సామాగ్రిని ముద్రించినా, నిర్దేశించిన సంఖ్యకు మించి ముద్రించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127-ఏ ప్రకారం చర్యలకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు.