కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ట్యాగ్ చేసి తరలిస్తున్న ధాన్యాన్ని ఎలాంటి పరిమితులు విధించకుండా దించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లకు సంబంచించిన రైస్ మిల్లుల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
వానాకాలంలో ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విపణిలోకి వచ్చే అవకాశముందని అన్నారు అందుకనుగుణంగా పాక్స్, ఐ.కె.పి ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా మార్కెట్ లోకి వస్తున్న ధాన్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు 112 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
ఆయా కేంద్రాల నుండి మిల్లులకు ట్యాగ్ చేసి లారీల ద్వారా పంపిన ధాన్యాన్ని మిల్లర్లు 24 గంటలలోగా దించుకోవాలని, అందుకవసరమైన హమాలీలలను అధిక సంఖ్యలో నియమించుకోవాలని, రైస్ మిల్లులో స్థలం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ కోరారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, సహాయ పౌర సరఫరాల అధికారి, డిప్యూటీ తహశీల్ధార్, మూడు డివిజన్ల నుండి రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.