నిజామాబాద్, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుండగా, నవంబర్ 10వ తేదీ నామిమేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువు అని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, కార్యాలయంలో ఒకే గడియారం ఉండాలని అన్నారు.
అభ్యర్థులు సమర్పించే నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వెంటదివెంట ఆన్‌లైన్ యాప్‌లో నామినేషన్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న ఫ్రీ గుర్తులను మాత్రమే కేటాయించాలని అన్నారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ, బ్యాలెట్ యూనిట్లు పోస్టల్ బ్యాలెట్స్ సిద్దం చేసుకోవాలని, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండిరగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పన పై శ్రద్ధ వహించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్‌ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు.
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు వచ్చే అప్పీళ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, పది లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.ఎన్నికల విధులు సకాలంలో నిష్పక్షపాతంగా నిబంధనల మేరకు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్.ఓ లు, ఈ.ఆర్.ఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.