కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి కౌంటింగ్ గదులను పరిశీలించి వాటిని వెంటనే శుభ్రపరచి పెయింటింగ్‌తో రెండు రోజులల్లో సిద్ధం చేయవలసినదిగా సూచించారు.
జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలకు సంబంధించి ఒక్కో రౌండ్‌లో 14 టేబుల్స్ చొప్పున ఓట్ల లెక్కింపు చేయుటకు, కౌంటింగ్ సిబ్బంది, ఆర్.ఓ., ఏ.ఆర్.ఓ., కౌంటింగ్ ఏజెంట్స్ కూర్చునే విధంగా మార్కింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రం వంద మీటర్ల దూరం వరకు ఎవరు రాకుండా బ్యారికేడిరగ్ ఏర్పాటు చేయవలసినదిగా పంచాయతీ రాజ్ ఈఈ మురళిని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ నుండి రౌండ్ వారీగా వెంటవెంటనే కౌంటింగ్ రూమ్‌కు ఈవీఎం తరలించే విధంగా మెరికల్లాంటి వ్యక్తులను ఏర్పాటు చేయాలని అన్నారు. సి.సి. కెమెరాల ఏర్పాటుతో పాటు రౌండ్ వారీగా ఫలితాలు వెల్లడిరచే విధంగా మీడియా పాయింట్, ఎల్.ఈ.డి. స్క్రీన్ ఏర్పాటు చేయాలని, మంచినీరు, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎస్సి కార్పొరేషన్ ఈ డి దయానంద్, ఎన్నికల అధికారులు ఉన్నారు.