కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పౌరసరఫరాల సమస్త ఆధ్వర్యంలో నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం అధికారులు, రైస్ మిల్ యజమానులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జిల్లాలో 2,92,105 మంది రైతులు 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిరచే వీలుందని అంచనాలు వేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, తేమ కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, టార్పల్లినులు అందుబాటులో ఉంచాలని కోరారు. గన్ని సంచుల కొరత లేకుండా చూడాలన్నారు. మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్లోడిరగ్ చేయాలని చెప్పారు.
ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లాలో 39 బాయిల్డ్,100 రా రైస్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవలసిన బాధ్యత రైస్ మిల్లుల యజమానులపై ఉందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహకార సంఘాలు, మార్కెట్ కమిటీ, ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి సతీష్ యాదవ్ మాట్లాడారు. వాల్టా చట్టం ప్రకారం రైస్ మిల్ యజమానులు బోర్లు వేయడానికి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, రైస్ మిల్లర్స్, అధికారులు పాల్గొన్నారు.