కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో గాని ఇంటర్నెట్ బేస్డ్ మీడియాలో కానీ లేదా వెబ్ సైట్లలో, రేడియో, (ఎఫ్‌ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, రేడియో, ఎఫ్. ఏం. ఛానళ్లు తదితర మాధ్యమాలలో ఎన్నికల ప్రకటనలు జారీ చేయాలనుకున్న వారు తప్పనిసరిగా ముందస్తుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి తీసుకోవాలన్నారు.
పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు సమర్పించి అనుమతి పొందాలని సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. సోషల్ మీడియా ప్లాటుఫారాలన్నింటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ప్రకటనలు ఉండాలన్నారు. గ్రూపులో సభ్యులు ఎవరైనా రెచ్చగొట్టే కామెంట్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగేంచే నాయకుల ప్రసంగాలు వైరల్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వెబ్సైట్లు, సోషల్ మీడియా వెబ్సైట్లలోని బ్లాగ్‌లు, స్వీయ ఖాతాలలో సందేశాలు / కామెంట్లు / ఫోటోలు, వీడియోల రూపంలోని రాజకీయ కంటెంట్ రాజకీయ ప్రకటనలుగా పరిగణించబడవని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వివరాలపై సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.