నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు వారిలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందిస్తూ గుణాత్మక విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ పేరిట నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో బుధవారం పెర్కిట్‌లో విద్యా స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.
ఆర్మూర్ మండలం పరిధిలోని 21 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు, ఆంగ్ల మాధ్యమంలో గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించే 140 మంది ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాల పెంపుపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్.సి.ఈ.ఆర్.టీ) నిపుణులచే ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రఎన్నికల కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, డీఈఓ దుర్గాప్రసాద్, డీఐఈఓ రఘురాజ్, డీపీఓ జయసుధ తదితరులు హాజరయ్యారు.
తాము బోధించే సబ్జెక్టులను ఇంగ్లీషు భాషలో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో, వారి సామర్థ్యాలను పెముపొందించేలా ఎలా బోధించాలి అనే అంశాలపై హైదరాబాద్ నుండి వచ్చిన రిసోర్సుపర్సన్లు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సెషన్ల వారీగా శిక్షణ తరగతులు కొనసాగాయి.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నప్పటికీ విద్యార్థుల్లో ప్రస్తుత పోటీ ప్రపంచ స్థాయికి తగినట్టుగా ప్రతిభ కనిపించడం లేదని ఒకింత ఆవేదన వెలిబుచ్చారు. గుణాత్మక విద్యా బోధనా, అభ్యాసన సామర్ధ్యాల పెంపుతో పరిస్థితిలో మార్పు వస్తుందని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో నిర్వహించిన అనేక సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గుణాత్మక విద్య పాఠశాల స్థాయిలో సాధించాలంటే ఆయా విషయాలలో నిర్దేశించిన సామర్ధ్యాలు, అభ్యాసన ఫలితాలు ఖచ్చితంగా తరగతి గది ద్వారా మాత్రమే సాధించవలసి ఉంటుందని, అప్పుడే లక్ష్య సాధన సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, రోజువారీ పీరియడ్ ప్రణాళికలతో భోదనాభ్యాసన ప్రక్రియలను మదింపు చేసుకొని పిల్లలకు సులభంగా అర్ధమయ్యే రీతిలో బోధన చేయాలని సూచించారు.
పిల్లలలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ముఖ్య కర్తవ్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాలని అన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలలో 90 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న అనేక మంది విద్యార్థులు పై చదువులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మాత్రం ప్రవేశ అర్హత పొందలేకపోతున్నారని, విద్యార్థుల్లో ఆశించిన సామర్ధ్యాలు పెంపొందించబడకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.
ప్రతి ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తుండగా, వారిలో అతికష్టంగా లక్ష మందికి మాత్రమే కొలువులు లభిస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యా స్థాయి నుండే విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తే, అద్భుత ఫలితాలు వస్తాయని, సాధారణ విద్యార్థులు కూడా తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. తమ పిల్లలు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. ముఖ్యంగా పేద, దిగువ మధ్య తరగతికి చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కమిషనర్ పార్థసారథి నొక్కి చెప్పారు.
బట్టీ పట్టే విధానం దూరమై, ప్రాథమిక స్థాయి నుండే అభ్యాసన ఫలితాలు, సామర్థ్యాల పెంపు దిశగా కృషి జరగాలన్నారు. ఎన్.సి.ఈ.ఆర్.టీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో, వారికి అర్ధమయ్యే విధంగా బోధించాలని, అప్పుడే సామర్ధ్యాలు మెరుగుపడతాయని హితవు పలికారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అభివర్ణించారు. అందుకే యావత్ సమాజం ఉపాధ్యాయులను ఎంతో గౌరవభావంతో చూస్తుందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా, అంకితభావం, నిబద్ధతతో విధులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చేలా విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా బోధన చేయాలని, ఎంతో నిష్ణాతులైన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇది కష్టమైన పని ఏమీ కాదని అన్నారు. అందరు విద్యార్థులను సమ దృష్టితో చూడాలని, అందరి ముందు చులకన చేయడం వల్ల విద్యార్థుల్లో మానసిక కుంగుబాటుకు దారితీస్తుందని, ఈ పరిణామం పలు సందర్భాల్లో పిల్లలను విద్యకు దూరం చేసే ప్రమాదం ఉందన్నారు. బాధించే గురువులుగా కాకుండా, బోధించే గురువులుగా విద్యార్థుల జీవితాలను చక్కదిద్దాలని, పాఠ్యాంశాలతో పాటు వారిలో నైతిక విలువలను పెంపొందిస్తూ ఆదర్శవంతులుగా నిలువాలని హితవు పలికారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తాను చదువుకున్న ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల గురించి, ఇక్కడి విద్యార్థుల బాగోగుల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పడే తపన అనన్య సామాన్యమైనది కొనియాడారు. తీరిక లేని కీలకమైన విధుల్లో కొనసాగుతున్నప్పటికీ విద్యా స్ఫూర్తి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కోవిడ్ సంక్షోభం తరువాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా ఆన్ లైన్ బోధన విస్తరించిందని అన్నారు. అత్యధిక శాతం ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆన్ లైన్ బోధనా విధానాన్నే అనుసరిస్తున్నాయని, తదనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతోందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికతతో కూడిన విద్యా బోధనను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
సామాన్య, పేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడులలో వారికి నాణ్యమైన విద్యను అందించి చక్కటి భవిష్యత్తుకు దోహదపడాలని, దీనిని ప్రతి ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టీ రిసోర్స్ పర్సన్లు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ చారి, రాజేందర్ కుమార్, ట్రస్ట్ కార్యదర్శి ఎన్.నర్సింలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అంతకుముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.