నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నామినేషన్ల దాఖలుకు సంబంధించి గురువారం పత్రికా ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు.
ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించబడుతుందని తెలిపారు. ఈ నెల 30 న పోలింగ్, డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు.
కాగా, ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు నామినేషన్లను ఈ నెల 3 నుండి 10వ తేదీ లోపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించారు.
జిల్లాలోని మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎం.మకరంద్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ నామినేషన్లను నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్, బోధన్ నియోజకవర్గానికి సంబంధించి బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్.డీ.ఓ. రాజాగౌడ్ నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.
అలాగే, బాన్సువాడ నియోజకవర్గ నామినేషన్లను బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి భుజంగరావు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను భీంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చిత్రామిశ్రా స్వీకరిస్తారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు నింపడంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు.
అభ్యర్థులు భారతీయ పౌరులై 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు., నామినేషన్లకు సంబంధించి అవగాహన కలిగి, వాటిని దాఖలు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదని, లేనిపక్షంలో తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అన్నారు. నామినేషన్ పత్రంలోని ప్రతి కాలం తప్పనిసరిగా నింపాల్సి ఉంటుందన్నారు. ఫారం-2బి లో నామినేషన్ పత్రం సమర్పించాలని, జనరల్ అభ్యర్థులైతే 10 వేలు, ఎస్సి, ఎస్టీలు అయితే 5 వేల డిపాజిట్ నగదు రూపంలో లేదా చలానా రూపంలో చెల్లించాలని సూచించారు.
నామినేషన్ పత్రంతో పాటు 10 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై ఫారం-26 అఫిడవిట్ సమర్పించాలని, క్రిమినల్ కేసులు ఉంటే అట్టి పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. అదేవిధంగా ప్రమాణ పత్రాన్ని అందజేయాలన్నారు. నామినేషన్ రోజు నుండే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అట్టి ఖాతా నుండే ఎన్నికల ఖర్చు నిర్వహించాలని, ఖర్చు వివరాలు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేయవలసి ఉంటుందని కలెక్టర్ సూచించారు.