కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని తెలిపారు.
ఈ నెల 30 న పోలింగ్, డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. నామినేషన్లను ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాన్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాలలోని రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఆర్.డి.ఓ. కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జుక్కల నియోజక వర్గ నామినేషన్లు మద్నూర్ తహశీల్ధార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మను చౌదరి, యెల్లారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఆర్.డి.ఓ. మన్నె ప్రభాకర్‌లు నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నామినేషన్ పత్రాలు నింపడంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వడానికిప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. .అభ్యర్థులు భారతీయ పౌరులై 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. నామినేషన్లకు సంబంధించి అవగాహన కలిగి, దాఖలు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదని, తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అన్నారు.
నామినేషన్ పత్రంలోని ప్రతి కాలం తప్పనిసరిగా నింపాల్సి ఉంటుందన్నారు. ఫారం-2బి లో నామినేషన్ పత్రం సమర్పించాలని, జనరల్ అభ్యర్థులైతే 10 వేలు, ఎస్సి, ఎస్టీలు అయితే 5 వేల డిపాజిట్ నగదు రూపంలో లేదా చలానా రూపంలో చెల్లించాలని సూచించారు. నామినేషన్ పత్రంతో పాటు 10 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై ఫారం-26 అఫిడవిట్ సమర్పించాలని, క్రిమినల్ కేసులు ఉంటె అట్టి పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు.
అదేవిధంగా ప్రమాణ పత్రాన్ని అందజేయాలన్నారు. నామినేషన్ రోజు నుండే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అట్టి ఖాతా నుండే ఎన్నికల ఖర్చు నిర్వహించాలని, అట్టి వివరాలు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేయవలసి ఉంటుందన్నారు.
పార్టీలు, అభ్యర్థులు యజమానుల అనుమతి లేకుండా వారి ఇండ్లపై గోడపత్రికలు, బ్యానర్లు, స్లోగన్ లు ప్రదర్శించరాదని సూచించారు. ప్రచార సభలు నిర్వహించుకునేందుకు సకాలంలో దరఖాస్తు చేస్తే ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణకు పొలిసు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారన్నారు. దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టివి, రేడియో, ఎఫ్..ఏం. రేడియోలు, దృశ్య శ్రవణ ప్రచారాలు, సినిమా హాళ్లలో ప్రచారం, బల్క్ సందేశాలు, రికార్డ్ చేసిన వాయిస్ సందేశాలు ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలనుకున్న వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారాలపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్వవేక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు.