నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో వానాకాలం 2023 – 24 సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను గురువారం అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.
వరి ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 421 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఇంకనూ మరికొన్ని చోట్ల కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూమ్ 08462-293087, 8142200200, 9908276004 నెంబర్లకు సంప్రదించి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు హితవు పలికారు. కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, డీఎస్‌ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.