నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ధర్పల్లి, తాళ్లరామడుగు, సిరికొండ మండల కేంద్రాలతో పాటు కొండూరులోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని మాయిశ్చర్ యంత్రం ద్వారా అదనపు కలెక్టర్ స్వయంగా కొలిచారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు కూడా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చని అన్నారు.
కాగా, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ సింహాచలం తదితరులు ఉన్నారు.