నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం వెలువడిన నేపధ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నూతన భవనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, నగర పాలక సంస్థ పాత భవనంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. కలెక్టర్, సీ.పీలు పై రెండు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.
రిటర్నింగ్ అధికారులు ఎం.మకరంద్, రాజేంద్రకుమార్‌లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నామినేషన్లు సమర్పించేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన వసతులు అన్నిఅందుబాటులో ఉంచాలని, హెల్ప్ డెస్క్ ద్వారా సహాయం అందించాలని, అవసరమైన దరఖాస్తుఫారాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు.
ఈ.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, నియమనిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సరిచూసుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ నెల 10 వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి, మిగితా రోజుల్లో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ఆర్.ఓ కార్యాలయాల వద్ద ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో సాయుధ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా 100 మీటర్ల నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు.
కాగా, ఆన్లైన్ లో కూడా నామినేషన్లను పంపించే వెసులుబాటు ఉందని, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుంటే నిబంధనలకు లోబడి ఉన్నవాటికి 48 గంటలలోపు అనుమతులు మంజూరు చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటూ, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తోడ్పాటును అందించాలని కోరారు.