కామారెడ్డి, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి , ఎస్పీ సింధు శర్మ తో కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సి-విజిల్, 1950, ఏం.సి.ఏం.సి. ల పనితీరును పరిశీలించి సంబంధిత నోడల్ అధికారులతో వాటిని నిర్వహిస్తున్న తీరును వ్యయ పరిశీలకులకు వివరించారు.
ఈ సంధర్భంగా వ్యయ పరిశీలకులు సూచించిన మేరకు పౌరులు వాయిస్ మెస్సేజ్‌లను, ఫిర్యాదులను వాట్సాప్, ఈ మెయిల్ ఐ. డి. ద్వారా కూడా తెలియపరచుటకు కంట్రోల్ రూమ్‌లో తగు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఏదేని సమాచారం తమ దృష్టికి వస్తే వెంటనే ఫోటోలు, వీడియో లు, మెస్సేజ్‌లను సి-విజిల్ యాప్, 7901678854 వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐ.డి.ల ద్వారా తెలియపరచాలన్నారు.
సి-విజిల్ యాప్‌ను తమ ఫోన్‌లలో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుప్రక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని కోరారు. 1950 టోల్ ఫ్రీ నెంబరుకు కూడా డయల్ చేసి తెలపవచ్చని, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ గోప్యంగా ఉంచుతామన్నారు. 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లో అన్ని ఏర్పాట్లు చేశామని ఉల్లంఘనలకు సంబందించిన వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి ఏదేని సమాచారాన్ని కూడా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా తెలియపరచినచో సమాధానం చెబుతారని కలెక్టర్ తెలిపారు.
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951, సెక్షన్ 127-ఏ ప్రకారం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల కరపత్రాలు, గోడపత్రికలు, ఎన్నికల ప్రచార సామాగ్రి అభ్యర్థుల అనుమతి, ఏం.సి.ఏం.సి. కమిటీ ఆమోదం మేరకు ముద్రించాలని కలెక్టర్ తెలిపారు. ముద్రించిన వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్, ప్రచురణల సంఖ్య తప్పక ఉండాలని సూచించారు.