నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సారనాథ్‌లోని అశోకుని స్థూపంలోని నాలుగు సింహాల స్ఫూర్తిగా… నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) ధైర్య సాహసాలతో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నలుగురు గల్ఫ్ సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అశోకుని సారనాథ్ స్థూపంలో నాలుగు సింహాలు వీపు వీపు కలుపుకుని వృత్తాకారంలో నిలుచుండి ముందుకు చూస్తూ ఉంటాయి. వెనుకవైపు ఉన్న నాలుగో సింహాన్ని చూడలేము. నాలుగు సింహాలు నాలుగు లక్షణాలను పవర్ (శక్తి / అధికారం), కరేజ్ (ధైర్యం), కాన్ఫిడెన్స్ (విశ్వాసం), ఫేత్ (నమ్మకం) ను సూచిస్తాయి.
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల), స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్) ముగ్గురు ఇప్పటికే బీ-ఫారాలు పొంది సింహం గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు.
సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని అభ్యర్థిత్వాన్ని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పరిశీలిస్తోంది. కాగా కొన్ని సమీకరణాల వలన టికెట్‌ను పార్టీ అధిష్టానం పెండిరగ్ ఉంచింది. టికెట్ వచ్చినా రాకున్నా సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని ఇండిపెండెంట్‌గా కనిపించని నాలుగో సింహం వలె రంగంలో నిలవడం ఖాయం అని గల్ఫ్ సంఘాల ప్రతినిధులు తెలిపారు.