బాన్సువాడ, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ బాజాపా అభ్యర్థిగా ఎన్నికలలో యెండల లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించడంతో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా భాజపా శ్రేణులు మోస్ర మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాలయంలో లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి మోస్రా, చందూర్, వర్ని, కోటగిరి, పోతంగల్ మండలం మీదుగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి కార్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి అక్రమాలను అంతమొందించేందుకు పార్టీ ఆదేశానుసారం పోటీ చేయడం జరుగుతుందని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ప్రజలతో మమేకమై నిజామాబాదులో ఓడగోట్టిన చరిత్ర తనకుందన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదనీ, బాన్సువాడను బానిస వాడగా మార్చిన స్పీకర్ పోచారం కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుండి బాన్సువాడ ప్రజలకు విముక్తి కలిగించడానికి బాన్సువాడ ప్రజలు అందరి సహకారం తనకు ఉండాలని ఆయన అన్నారు. ఈనెల 8న బాన్సువాడ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.
బాన్సువాడ ప్రజల హృదయాల్లోంచి వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. బాన్సువాడలో స్పీకర్ ఓటమి సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, ఓబిసి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, కో కన్వీనర్ భూపాల్ రెడ్డి, బిజెపి నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ, అర్సపల్లి సాయి రెడ్డి, పటేల్ ప్రసాద్, చిదుర సాయిలు, గుడుగుట్ల శ్రీనివాస్, కోణాల గంగారెడ్డి, డాకయ్య, లింగాల రవీందర్ రెడ్డి, ముత్యాల సాయిబాబా, దత్తపురం సాయిబాబా, శంకర్ గౌడ్, నారాయణ యాదవ్, తుప్తి ప్రసాద్, రాజాసింగ్, అశ్విన్, విశాల్, గుడుగుట్ల అనిల్, శ్యామ్, సాయిరెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.