కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా నామినేషన్ పత్రాలు నింపడంలో అభ్యర్థులు తగు సలహాలు, సూచనలు అందించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి తహసీల్ధార్ కార్యాలయం నందు ఫెసిలిటేషన్ సెంటర్ (హెల్ప్ డెస్క్) లో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్‌లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్, అఫిడవిట్ దాఖలు, స్వీకరణలో ఎన్నికల నియమావళి మేరకు అనుసరించవలసిన విధానాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడానికి వీలుంటుందని అన్నారు. అభ్యర్థులు ఫారం-2బి లో నామినేషన్ పత్రం సమర్పించాలని, నామినేషన్ పత్రంలోని ప్రతి కాలం తప్పనిసరిగా నింపారో లేదో పరిశీలించాలన్నారు.
నామినేషన్ పత్రంతో పాటు 10 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై ఫారం-26 అఫిడవిట్ సమర్పించాలని, క్రిమినల్ కేసులు ఉంటే అట్టి పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. అదేవిధంగా ప్రమాణ పత్రాన్ని అందజేయాలన్నారు. నామినేషన్ రోజు నుండే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అట్టి ఖాతా నుండే ఎన్నికల ఖర్చు నిర్వహించాలని, ఖర్చు వివరాలు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేయవలసి ఉంటుందని ఇట్టి విషయాల పట్ల అభ్యర్థులకు అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ లత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.