ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి కలెక్టర్‌ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలైన నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో గల 833 ప్రాంతాలలో మొత్తం 1549 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్‌ 07 నాటికి రూపొందించబడిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 1389291 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. బదలాయింపులకు సంబంధించిన ఫారం-06 , ఫారం-08 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకనూ కొనసాగుతోందని, వాటి పరిష్కారం అనంతరం ఆయా నియోజకవర్గాలలో ఓటర్ల తుది జాబితా ఖరారవుతుందని వెల్లడిరచారు.

ఓటర్లలో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్‌ సిటిజన్లు 17580 మంది ఉండగా, 40 శాతం పైబడి వైకల్యం కలిగిన దివ్యంగులు 23919 మంది ఉన్నారని, వీరు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా ఫారం-12 (డి) పంపిణీ చేశామని కలెక్టర్‌ తెలిపారు. అన్ని నిబంధనలను పాటిస్తూ, ఇళ్లకు పోలింగ్‌ అధికారుల బృందాలు వెళ్లి పూర్తి పారదర్శకంగా వీడియో చిత్రీకరణ నడుమ వారి ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తాయని, సీక్రెట్‌ ఓటింగ్‌ కోసం ఓటింగ్‌ కంపార్ట్‌ మెంట్‌ ను కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు.

ఇప్పటివరకు సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి 889 మంది, దివ్యంగులకు సంబంధించి 858 మంది ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఫారం-12 (డి) సమర్పించారని తెలిపారు. అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే 13 శాఖల ఉద్యోగులకు సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ వెసులుబాటు కల్పించడం జరిగిందని, దీనిని వినియోగించదల్చిన వారికి ఈ నెల 8 వ తేదీ వరకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో ఫారం-12 (డి) అందించే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిర్దేశించిన తేదీలలో ఆర్‌.ఓ కార్యాలయాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఒకసారి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించబడదని స్పష్టం చేశారు.

జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలకు అనుగుణంగా ఇప్పటికే మొదటి ర్యాండమైజెషన్‌ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)లను తరలించి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరచడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య కంటే 25 శాతం అదనంగా (రిజర్వు) బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లను 1934 చొప్పున కేటాయించడం జరిగిందని, వి.వి.ప్యాట్లు 40 శాతం అదనంగా కలుపుకుని మొత్తం 2166 పంపించామని వివరించారు.

నామినేషనలకు సంబంధించి ఈ నెల 7 వ తేదీ వరకు జిల్లాలో అన్ని సెగ్మెంట్లను కలుపుకుని 34 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మీదట ఈ నెల 15 వ తేదీన ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కానున్నారని, వారికి గుర్తులను కేటాయించి ఈ.వీ.ఎం ల రెండవ విడత ర్యాండమైజెషన్‌ చేపట్టి కమిషనింగ్‌ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా ఇప్పటికే పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓ.పి.ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. పీ.ఓలు 1778 మంది, ఏ.పీ.ఓలు 1774 , ఓ.పీ.ఓలు 3599 లు కలుపుకుని మొత్తం 7151 మందిని పోలింగ్‌ విధుల కోసం ర్యాండమైజెషన్‌ ద్వారా బాధ్యతలు కేటాయించామని తెలిపారు.ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు, ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు వీలుగా 218 సెక్టార్లను ఏర్పాటు చేస్తూ ఎస్‌.ఎస్‌.టీ, ఎఫ్‌.ఎస్‌.టీ బృందాలను నియమించామని, అనునిత్యం 24 గంటల పాటు ఈ బృందాలు నిఘా ఉంచుతాయని అన్నారు.

నిఘా బృందాల పనితీరును కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతికతో కూడిన పీ.టీ.జెడ్‌ కెమెరాలను నిఘా బృందాల వాహనాలకు అమర్చడం జరిగిందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు, ఆరు అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టుల వద్ద కూడా సి.సి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ. 8940799 విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, రూ. 3.80 కోట్ల నగదు, రూ. 78.45 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు.

పట్టుబడిన నగదులో జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా పరిశీలన జరిపిన మీదట సరైన ఆధారాలు ఉన్న వారికి రూ. 2.39 కోట్ల నగదును తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. రూ. పది లక్షల పైచిలుకు పట్టుబడిన నగదుకు సంబంధించి రూ. 1.04 కోట్ల పైచిలుకు నగదును ఐ.టీ శాఖ అధికారులకు అప్పగించామని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాల కోసం సువిధ యాప్‌ ద్వారా 805 దరఖాస్తులు రాగా, 653 దరఖాస్తులకు సకాలంలో అనుమతులు మంజూరు చేశామని అన్నారు. సి.విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ, కంట్రోల్‌ రూంలకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం జరుగుతోందన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా 260 మంది రౌడీషీట్‌ కలిగిన వారిని, 41 మంది కమ్యూనల్‌ రౌడీలను బైండోవర్‌ చేశామని తెలిపారు. అలాగే 2018, 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కేసులు నమోదైన వారిలో 266 మందిని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసులు నమోదైన 184 మందిని కూడా బైండోవర్‌ చేశామన్నారు.

లైసెన్సులు కలిగిన 69 ఆయుధాలను డిపాజిట్‌ చేయించామని, బ్యాంకులకు భద్రతా దృష్ట్యా 23 తుపాకుల వినియోగానికి మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా 750 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని, మరో 9 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు కేటాయించారని, వీరిలో ఇప్పటికే మూడు కంపెనీల బలగాలు జిల్లాకు చేరుకున్నాయని సీ.పీ తెలిపారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను నియమిస్తామని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయని వివరించారు. అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించడం, గడువు ముగిసిన తరువాత కూడా ప్రచారం కొనసాగించడం, నిర్ణీత వేళలను దాటి మైకులను వినియోగించడం వంటి వాటిని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, అదనపు డీ.సీ.పీ జయరాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »