కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే ఆన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజిమెంట్ సిస్టం (ఓ.పి .ఏం.ఎస్.) లో నమోదు చేసి అకనాలెడ్జ్ జారీచేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్ లో వానాకాలం ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే ఆన్‌లోడ్ చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 13,661 మంది రైతుల నుండి 85,230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గన్ని సంచుల కొరత లేదని, ట్యాబ్ ఎంట్రీ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా వరి పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2,203, సాధారణ రకానికి 2,183 పోస్టర్‌ను, కరపత్రాన్ని అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదుల కోసం 1967 లేదా 180042500333 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేవచ్చని రైతులకు సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లుల సంఘము అధ్యక్షులు,రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.