కామారెడ్డి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ (43) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో డాక్టర్లు అత్యవసరంగా ఓ నెగిటివ్ ప్లేట్ లెట్స్ కావాలని తెలియజేయడంతో వారికి కావలసిన ప్లేట్‌లెట్స్‌ను ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ మానవతా దృక్పథంతో స్పందించి 52వ సారి అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దీపావళి పండుగ అయిన, అర్ధరాత్రి వేళ అయినా ఆపదలో ఉన్నవారికి చాలామంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారని ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం ఉందని అడిగినప్పుడు కొంతమంది మనకెందుకులే అని అనుకుంటారని, కానీ ఏదైనా ఒక సందర్భంలో అదే పరిస్థితులు వారి కుటుంబాలకు వచ్చినప్పుడు స్పందించకపోతే పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎప్పుడైనా సరే వారికి కావలసిన రక్తాన్ని,ప్లేట్ లెట్స్ ను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 15 సంవత్సరాలుగా వేలాది మందికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ప్రాణాలను కాపాడడం జరిగిందనీ, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
రక్తదానం చేసిన రక్తదాత కిరణ్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిఎస్ రక్తనిధి కేంద్రం ప్రతినిధులు జీవన్, వెంకటేష్, సంపత్ పాల్గొన్నారు.