కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల పరిశీలన పక్రియ ముగియడంతో పాటు బుధవారం ఉపసంహరణ అనంతరం బరిలో నిలబడే అభ్యర్థులకు అనుగుణంగా పొరుగు జిల్లాల నుండి ఈ.వి.ఏం. వి.వి.ప్యాట్ల సర్దుబాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో కలిసి పొలీసు కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తూ బ్యాలట్ పేపర్ ముద్రణ చేపట్టాలన్నారు. ఓటరు జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని, ఓటరు స్లిప్పుల పంపిణితో పాటు ప్రతి ఇంటికి ఓటర్ గైడ్ పంపిణి జరిగేలా చూడాలన్నారు. ఫారం-12 డి ద్వారా ఇంటివద్దే ఓటింగ్ వేయుటకు దరఖాస్తు చేసుకున్న వారి నుండి పోస్టల్ బ్యాలెట్‌ను రెండు రోజులల్లో తీసుకునేలా రూట్ మ్యాప్‌తో బృందాలను సిద్ధం చేసుకొని, రాజకీయ పార్టీల ఏజెంట్లకు సమాచారమందించాలన్నారు.
నియోజక వర్గాలలో ఏర్పాటు చేస్తున్న 23 ఆదర్శ పోలింగ్ స్టేషన్లతో పాటు, ప్రతి నియోజకవర్గంలో 5 మహిళా పోలింగ్ స్టేషన్లు, దివ్యంగుల కోసం, యువత కోసం ప్రతి నియోజక వర్గంలో ఒక్కో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని అన్ని హంగులతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని, నేను తప్పక ఓటేస్తాను అనే సెల్ఫ్ పాయింట్ ను ఏర్పాటు చేయాలన్నారు.
పోలింగ్ రోజు వాలంటీర్లను సేవలు ఉపయోగించాలని అన్నారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును అకౌంటింగ్ చేయడంలో ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నదని, సువిధ ద్వారా వచ్చే వాటికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రవర్తనా నియమావళిని ఉల్లంగిస్తూ సభలు,సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న వాహనాలు తిరుగుతున్న, లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తున్న, డబ్బు, మద్యం, కానుకలు పంపిణి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనుమతి లేకుండా ప్రకటనలు వస్తున్నా నోటీసులు ఇచ్చి ఖర్చును బుక్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, మన్నే ప్రభాకర్, ఎన్నికల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.