నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీ.ఈ.ఓ సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశాలలో భాగంగా మంగళవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి వెబ్ క్యాస్టింగ్, ఓటర్లకు స్లిప్పుల పంపిణీ తదితర వాటిపై సూచనలు చేశారు.
వెబ్ క్యాస్టింగ్ కోసం సరిపడా సిబ్బందిని నియమిస్తూ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐ.టి.ఐ తదితర సంస్థలకు చెందిన విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ కు సరిపడా వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
కాగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందించి వారి నుండి అక్ నాలెడ్జ్ మెంట్ తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కు కొన్ని రోజుల ముందే ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందనే వివరాలను తెలిపే ఓటరు స్లిప్స్ పంపిణీ చేయించాలని సూచించారు.
ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల మార్పు జరిగిన ప్రదేశాల్లో ప్రతి ఓటరుకు వారి ఓటు వివరాలతో కూడిన చీటీలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూమ్ మీటింగ్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.