కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
15-ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిత్వానికి పోటీలో నిలిచిన అభ్యర్థులందరు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను పరిశీలనకు తీసుకురావాలని ఎల్లారెడ్డి రిటర్నింగ్ అధికారి గురువారం ఒక నోటీసులో కోరారు. అభ్యర్థుల ఖర్చుల లెక్కలను వ్యయ నియంత్రణ పరిశీలకులు పర శివమూర్తి తనిఖీ చేస్తారన్నారు.
ఈ నెల 17, 22 మరియు 27 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయము (తహశీల్ కార్యాలయం) లో మూడుసార్లు పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా మూడు సార్లు తమ లెక్కలను నిర్ణయించిన సమయాలలో ఆమోదింపచేసుకోవాలన్నారు.
అభ్యర్థులు తమ ఖర్చుల రిజిస్టర్ (ఫారం ఏ, ఫారం బి, మరియు ఫారం సి) లతో పాటు బిల్లులు / వోచర్లు , బ్యాంకు పాసుబుక్, బ్యాంకు లావాదేవీలతో పాటు హాజరై తమ ఖర్చులను అమోదింప చేసుకోవాలన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 77 ననుసరించి అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరములను ఆమోదింప చేసుకోనట్లయితే వారిని ఎన్నికల లెక్కలను సమర్పించుటలో విఫలమయ్యారని నిర్ణయించడం జరుగుతుందన్నారు.