ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్‌ అబ్జర్వర్‌ అజయ్‌ వి.నాయక్‌, ఐఏఎస్‌, రాష్ట్ర పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా, ఐపీఎస్‌ లు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)కు చేరుకోగా, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

స్టేట్‌ అబ్జర్వర్‌ లు నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ కు చేరుకుని, కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ తో పాటు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు గౌతమ్‌ సింగ్‌, సుబ్రా చక్రవర్తి, లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు, పోలీస్‌ అబ్జర్వర్‌ రుతురాజ్‌ లతో భేటీ అయ్యి వారిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రాష్ట్ర పరిశీలకులకు వివరించారు.

జిల్లాలోని నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీలో ఉన్నందున రెండు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరదని, తదనుగుణంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ పూర్తి చేసి అదనపు బ్యాలెట్‌ యూనిట్లను కేటాయించామని అన్నారు. ఇప్పటికే అన్ని సెగ్మెంట్లకు ఈవీఎం లు, పోలింగ్‌ సిబ్బంది కేటాయింపులకు సంబంధించిన ర్యాండమైజెషన్‌ సైతం పూర్తయ్యిందని తెలిపారు.

80 సంవత్సరాలకు పైబడిన సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు 1310, నలభై శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగ ఓటర్లు 1050 మంది ఇంటి నుండి ఓటు వేసేందుకు వీలుగా దరఖాస్తులు చేసుకున్నారని, ఈ మేరకు వారి ఇళ్ల వద్దకే బృందాలను పంపించి ఓటింగ్‌ జరిపేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్న మరో 7733 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఫారం-12 అందించారని కలెక్టర్‌ రాష్ట్ర పరిశీలకుల దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర పరిశీలకులు ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల గురించి జిల్లాకు కేటాయించబడిన సాధారణ పరిశీలకులను ఆరా తీయగా, ఇప్పటి వరకు ఆరు నియోజకవర్గాల పరిధిలోనూ పరిస్థితులన్నీ సజావుగానే ఉన్నాయని వారు రాష్ట్ర పరిశీలకులకు తెలియజేశారు. కాగా, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని స్టేట్‌ అబ్జర్వర్‌లు పోలీస్‌ కమిషనర్‌కు సూచించారు.

పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎలక్షన్‌ కమిషన్‌ పాసులు కలిగి ఉన్న వారిని మినహాయించి, ఇతరులు ఎవరినీ లోనికి అనుమతించకూడదని, ఈ విషయమై క్షేత్ర స్థాయిలో బందోబస్తు విధులు నిర్వర్తించే సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌ ఫోన్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించరాదని, పోలింగ్‌ స్టేషన్ల సమీపంలో ఓటర్లను అభ్యర్థులు, వారి ఏజెంట్లు కలిసి వారికే ఓటు వేసేలా ఒత్తిడి చేయకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు.

ఎన్నికల బందోబస్తు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించకూడదని, అలాగని నిబంధనల ఉల్లఘనకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులను ఆదేశించారు. ఓటింగ్‌ సందర్భంగా ఏవైనా పోలింగ్‌ కేంద్రాల వద్ద అనుకోని రీతిలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నట్లైతే, సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించాలని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »