కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పులను ఓటర్లకు సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బూత్ స్థాయి అధికారులకు సూచించారు. శనివారం లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని 178, 179 పోలింగ్ బూతులు సందర్శించి ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై బి.ఎల్.ఓ. లను ఆరా తీశారు.
ఓటర్ స్లిప్పులను ఇంటిలోని పెద్దవారికి అందజేయాలని, ఇతర వ్యక్తులకు అందించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ స్లిప్పులను ఓటరుకు అందించిన అనంతరం ఖచ్చితంగా సంతకాలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి ఇంటికి ఓటరు గైడ్‌తో పాటు సి విజిల్ కరపత్రాలను కూడా ఓటర్లకు అందించాలని బిఎల్‌ఓలకు సూచించారు. ప్రతి ఓటరు ఈనెల 30వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కలిగించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే వారి ఫోటోలను తీసి సి-విజిల్ యాప్ ద్వారా పంపాలని వారిపై చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా సి విజిల్ కరపత్రాన్ని ఓటర్లకు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మల్లిఖార్జున్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ చంద్ర రాజేష్‌తో పాటు బిఎల్వోలు ఉన్నారు.