పోలింగ్‌ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎన్నికలలో పోలింగ్‌ అతి కీలకమైనందున ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. సాధారణ పరిశీలకులు గౌతమ్‌ సింగ్‌, సుబ్రా చక్రవతి, లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆరు సెగ్మెంట్ల పరిధిలో 500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని, మొదటి విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను పూర్తయ్యిందని అన్నారు. ర్యాండమైజెషన్‌ జాబితాను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్‌ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్‌ కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు చేరుకొని పోలింగ్‌ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్‌ సిబ్బందితో కలిసి పోలింగ్‌ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.

నిబంధనలకు అనుగుణంగా మాక్‌ పోలింగ్‌ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకే మాక్‌ పోల్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చుసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్‌ పోల్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మాక్‌ పోల్‌, తదనంతరం చేపట్టే పోలింగ్‌ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్‌ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలూ ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్‌ పోలింగ్‌ కంపార్ట్మెంట్‌ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈ.వి.ఎం లు పనిచేయకపోతే, వాటి స్థానంలో వేరే ఈ.వి.ఎం లను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. అయితే ఈ.వి.ఎంలు పనిచేయని సందర్భాల్లో తక్షణమే వాటిని మార్చకూడదని, ఈ.సి.ఐ.ఎల్‌ ఇంజినీర్లు పరిశీలించిన మీదటే వేరే ఈ.వి.ఎం లను వినియోగించాలని కలెక్టర్‌ హితవు పలికారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలని, టెండర్‌, ఛాలెంజ్‌ ఓటింగ్‌ లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్‌ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్‌ విధుల్లో స్వయంగా పాల్గొనకూడదని కలెక్టర్‌ తెలిపారు.

పోలింగ్‌ ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్‌ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్‌ గోప్యతను కాపాడే విధంగా మైకో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి పార్టీ తరఫున ఇద్దరు ఏజెంట్లను నియమించనుండగా, పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్కరిని మాత్రమే అనుమతించాలని అన్నారు. ఉదయం 7.00 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై, సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందన్నారు.

ఐదు గంటల లోపు పోలింగ్‌ కేంద్రం లోనికి వచ్చిన ఓటర్లు ఇంకను మిగిలి ఉంటే, వారిని వరుసక్రమంలో నిలబెట్టి చివరి నుండి ముందు వరుసలో ఉన్న ఓటరు వరకు క్రమ సంఖ్య చీటీలు అందించి పోలింగ్‌ జరిపించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలన్నింటినీ మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్‌ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరిని పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.

కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని సూక్ష్మ పరిశీలకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మేరకు రెండవ విడత శిక్షణ కేంద్రాల వద్ద, అలాగే రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను మైక్రో అబ్జర్వర్లు ఈ మేరకు ఆకళింపు చేసుకున్నారు అనేది తెలుసుకునేందుకు వీలుగా జనరల్‌ అబ్జర్వర్లు వారికి పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, మాస్టర్‌ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »