నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 187 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తెలిపారు. పోలింగ్ నిర్వహణ విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు రాండమైజేషన్ ద్వారా కేటాయించబడిన రూరల్ సెగ్మెంట్ సిబ్బందికి మంగళవారం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ విడత శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ సహాయంతో ఉద్యోగులు తొలి రోజైన మంగళవారం 180 మంది, బుధవారం 187 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి వివరించారు. ఇంకనూ ఎన్నికల సిబ్బంది ఎవరైనా మిగిలి ఉంటే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు.